🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 11:37 pm Posted by : Telangana Vaartha

అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలి

News Image
నవంబర్ 15–18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలి
అక్టోబర్ 6 నుండి మహాసభల విజయవంతానికై నిధుల సేకరణ ను జయప్రదం చేయండి.
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: నవంబర్ 15 నుండి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డిపిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు రైతాంగ పోరాటాల చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ ప్రాంతం అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని తెలిపారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతాంగం సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వేలాది మంది రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు చేసిన త్యాగాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.రైతాంగ పోరాటాల చరిత్రకు నిలయమైన నల్లగొండలో అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలు జరగడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన అన్నారు. గత పోరాటాల స్ఫూర్తితో నేటి రైతాంగ సమస్యలపై మరింత ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరంఉందన్నారు.దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, సాగు పెట్టుబడులు పెరగడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, సాగునీటి సమస్య, పంట నష్టాలకు తగిన పరిహారం అందకపోవడం, రుణభారం, కౌలు రైతులకు రక్షణ లేకపోవడం వంటి సమస్యలు రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.రైతులు పండించిన ప్రతి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి కనీసం 50 శాతం అదనంగా కలిపి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న, సన్నకారు రైతుల రుణభారాన్ని తగ్గించేందుకు సమగ్ర రుణమాఫీ చేపట్టాలని, వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అకాల వర్షాలు, వాతావరణ మార్పులు, కరువు, వరదలు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోతున్న రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కాకుండా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల జీవనోపాధి కూడా తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధి, రోజుకు రూ.700 వేతనం, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.నల్లగొండ రైతాంగ పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకు 36వ మహాసభలు దోహదపడతాయని మల్లు అన్నారు. మహాసభల విజయవంతానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, గ్రామస్థాయి పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, మహాసభల విజయవంతనికై రైతు కుటుంబాల నుండి విరాళాలను సేకరించాలని కోరారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళా రైతులు, యువత పెద్ద సంఖ్యలో మహాసభల కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు యాక లక్ష్మి,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, వివిధ ప్రజా సంఘాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home