తండ్రి బాటలోనే తనయుడు
అర్వపల్లి శ్రీ యోగనందా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అనంతరం విలేఖరులతో మాట్లాడారు.తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో నాలుగు తరాలుగా అనుబంధం ఉందని, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తమ కుటుంబానికి సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం, అసంతృప్తి లేదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తమ కుటుంబం ఎప్పుడూ ధిక్కరించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటై తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని, తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలకు తావులేదని అన్నారు.తనకు టికెట్ లభించడంలో దేవుడి ఆశీస్సులతో పాటు తన తండ్రి, దివంగత మాజీ మంత్రి ‘టైగర్ దామన్న’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. దామోదర్ రెడ్డి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు.అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన తాను, కెనడా, అమెరికాల్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సంస్థలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసిన అనుభవం ఉందన్నారు. తన తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చానని, 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నానని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు గుర్తుచేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చి ప్రస్తుతం రైతుగా వ్యవసాయం చేయడంతో పాటు డైరీ, చేపల పెంపకం వంటి రంగాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని, యుద్ధరంగంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు గ్రామ గ్రామాన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ యోగనందా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ దేవస్థానం అభివృద్ధి కోసం తమ కుటుంబం తరఫున 850 ఎకరాల భూమిని దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విరవిధేయులు. సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పట్టభద్రుల సమస్యలను ప్రజల తరఫున బలంగా వినిపించేందుకు కృషి చేస్తాను” అని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.