🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:02 pm Posted by : Telangana Vaartha

చిట్టీలు, అధిక రాబడి పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు – ఇద్దరు అరెస్ట్

News Image
చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన దానిపై చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అతని భార్యను చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలు, నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వి. మహేష్, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44), ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తన భార్య బానోతు అనూష (33) సహకారంతో 2015 నుంచి డెయిలీ కలెక్షన్లు, చిట్టీల వ్యాపారం నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది అని డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే భూములు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు, చిట్టీల గడువు పూర్తైనప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించగా, మిగిలిన మొత్తాన్ని సుమారు 500–600 మందికి రూ.10,000 నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10 శాతం వరకు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లు గుర్తించడం జరిగినదని డిఎస్పీ తెలిపారు.

కేసులో ఇప్పటివరకు గుర్తించిన ఆర్థిక వివరాలు
- బాధితుల నుంచి సేకరించిన మొత్తం: రూ.6,24,50,000/-
- తిరిగి చెల్లించిన మొత్తం: రూ.3,18,54,000/-
- ఇంకా చెల్లించాల్సిన బకాయిలు: రూ.3,05,96,000/-

నిందితుల నుంచి స్వీకరించిన మొత్తాలు, తిరిగి చెల్లింపులు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

అరెస్టయిన నిందితులు:

1. బానోత్ రాజు,, వయస్సు 44 సంవత్సరాలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
2. బానోతు అనూష, భర్త: రాజు, వయస్సు 33 సంవత్సరాలు, గృహిణి.

ఇద్దరినీ అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు.

ఇతర బాధితులు పోలీసులను సంప్రదించాలి..

బానోత్ రాజు, బానోతు అనూష చేతిలో మోసపోయిన ఇతర బాధితులు ఎవరైనా ఉంటే, తమ వద్ద ఉన్న ఆధారాలతో వెంటనే చివ్వెంల పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రజలను అధిక రాబడులు, చిట్టీలు, పెట్టుబడుల పేరుతో మోసగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీఐ జి. రాజశేఖర్, ఎస్‌ఐలు వి. మహేశ్వర్, వెంకన్నతో పాటు సిబ్బంది జనార్దన్ రెడ్డి, వెంకటేష్‌లను అధికారులు అభినందించారు.
🏠 Home