🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 6:54 pm Posted by : Telangana Vaartha

మైనింగ్ లో టెంపరరీ డ్రైవర్ రాజ్...!

News Image
ఇసుక రవాణాలో అవినీతి జలగ... మైనింగ్ శాఖలో బుసలు కొడుతున్న అవినీతి ఆనకొండ...
సంజీవ మాయాజాలానికి ఎంత పెద్ద ఆఫీసరైనా సరెండర్ కావాల్సిందే...?
మైనింగ్ ఆదాయానికి గండి కొడుతున్న సంజీవ బుల్లెట్...! అధికారులంతా గప్ చుప్ సైలెంట్...!!
పేరు రాయడం తప్ప చదువు రాదు...
ఒకనాడు తింటానికి తిండికి లేని పేద జీవితం.... నేడు కోటీశ్వరుని విలాసం
సెటిల్మెంట్లకు అడ్డాగా 600 గజాలలో ఐలాపురం వద్ద నిర్మించుకున్న సొంత గెస్ట్ హౌస్... నేడుకోట్లకు పడగలెత్తిన వైనం
బినామీ పేర్లతో మైనింగ్ శాఖకు రెండు వాహనాలు...!
ఇసుక రవాణాకు రెండు ట్రాక్టర్లు...!
తాను చెప్పింది వినని అధికారులకు ముప్పు తిప్పలు.. మూడు చెరువుల నీళ్లు...!!!
తాను చెప్పినట్లు వినని అధికారులపై బ్లాక్ మెయిల్ చేస్తూ పేపర్లలో గలీజురాతలు రాపించి బెదిరింపులు సంజీవ బెదిరింపులకు భయపడి 'మాకు ఎందుకులే' అని ప్రభుత్వ ఆదాయానికి కళ్ళ ముందు గండి కొడుతున్నా మౌన దీక్షలో అధికారులు మైనింగ్ శాఖలో ఉద్యోగం చేయడానికి సూర్యాపేటకు రావాలంటేనే సంజీవ దందాకు బెంబేలెత్తిపోతున్న అధికారులు తన మాట వినే తన బంధువులు, స్నేహితులకే ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఏడి పోస్టు ఖాళీగా ఉన్న సమయంలో ఏజీ పై ఒత్తిడి తెచ్చి ఎస్ ఆర్ ఓ పోస్టులు ఇప్పించుకున్న మాయలోడు...!
అధికారులు లేకుండానే ఇసుక, మట్టిట్రాక్టర్లను అడ్డగిస్తూ డబ్బులు దండుకుంటున్న కిలాడి వీరుడు...
ఎస్ ఆర్ ఓ లను కీలుబొమ్మలు లాగా వాడుకుంటూ తనిఖీలకు పంపుతూ యదేచ్చగా ఆర్థిక దోపిడీ...!
దొంగ పాస్వర్డ్లు, ఓటీపీలు, నకిలీ నెంబర్ ప్లేట్ల ద్వారా ట్రాక్టర్ ఓనర్లతో లంచాలు మాట్లాడుకుని రోజుకు 400 ట్రాక్టర్లకు అనధికారికంగా ఇసుక నింపుతూ...ఎస్ఆర్ఓ లను వాడుకుంటూ రోజుకు 20 లక్షల రూపాయలను ప్రభుత్వ ఆదాయానికి రాకుండా గండి కొడుతూ సొంత సంపాదన చేసుకుంటున్న సంజీవ మాయాజాలం...!
వాహనాలకు రూట్ మ్యాప్ ఉండదు...! నెలలో ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ తిరిగింది అనేది రాయరు...! క్యాంపులకు వెళ్లినట్టు బిల్డప్ మాత్రం ఇస్తారు...! కార్యాలయం వద్ద వాహనాలు ఉంటే క్యాంపులకు అధికారులు ఎలా వెళ్తారు...?
✍️ డాక్టర్ కృష్ణ బంటు, పీహెచ్డీ & గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత
అతను ఒక తన పేరు మాత్రమే రాసుకునే చదువురాని ఒక మామూలు సాధారణ వ్యక్తి. గత కొంతకాలం వరకు సాదాసీదా జీవితం గడిపిన అతను నేడు కోట్లకు పడగలు ఎత్తాడనే ఆరోపణలు సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి హైదరాబాదులోని మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయం వరకు ఆరోపణలు గుప్పు గుప్పుమంటూ పొగలు లావా లాగా ద్రవిస్తూ విర జిమ్ముతున్నాయి. సాధారణంగా ఎవరైనా, ఏదైనా శాఖకు అవసరం ఉంటే వాహనాలు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు. అలాగే మైనింగ్ శాఖకు బినామీ పేర్ల మీద ఒక బొలెరో, మరొక బ్రెజా వాహనాలను కలకోట్ల సంజీవ అనే వ్యక్తి లీజుకు పెట్టాడు. ఒక వాహనానికి తన బంధువును, మరొక వాహనానికి తాను డ్రైవర్గా ఉంటున్నాడు. అంతేకాకుండా రెండు ఇసుక ట్రాక్టర్లను ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక రవాణాకు నడుపుతున్నాడు. ఇదంతా మామూలే కదా అన్నట్టుగా వ్యవహరిస్తూ పైకి మాత్రం ఏమీ తెలియని అమాయకుడిలా బుల్లెట్ బండి పై తిరుగుతూ మైనింగ్ శాఖలో అవినీతి దందాకు తెరలేపాడు. గత 14 సంవత్సరాలుగా ఒకే శాఖలో తిష్ట వేయడంతో పాటు లోటుపాట్లు తెలుసుకొని, ఏ అధికారిని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలో ఆ విధంగా నయానో, భయానో, మంచితనంతోనో, మాయతోనో, భ్రమ పెడుతూ, డబ్బు ఆశలు చూపెడుతూ, గెస్ట్ హౌస్ లలో విందు, మందు, ఇంకా రాయడానికి వీలులేని భ్రమలు కల్పిస్తూ అధికారులు తాను చెప్పిందే వినేటట్లుగా చేసుకొని అవినీతి దందాకు ఆజ్యం పోశాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ ఆర్ ఓ లను కీలుబొమ్మలుగా వాడుకుంటూ అవినీతి దోపిడి
సాండ్ రిచ్ ఆఫీసర్ (ఎస్ ఆర్ ఓ) లను ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించింది. అయితే ఎస్ఆర్వోలకు వచ్చిన వారందరినీ కాదని తనకు బంధువులుగా, స్నేహితులుగా ఉన్న నలుగురిని చదువుతో సంబంధం లేకుండా ఎంపిక చేసుకొని మైనింగ్ శాఖ ఏడి ద్వారా అనుమతి పొందాల్సి ఉన్నప్పటికీ ఆ సమయంలో రెగ్యులర్ ఏ డి లేకపోవడంతో ఏజీ గా ఉన్న అధికారితో తాను ఎంచుకున్న నలుగురిని ఎస్ఆర్ఓలుగా నియమించుకోవడంలో సంజీవ విజయవంతమయ్యారు. తదుపరి వారి ద్వారానే తనిఖీలు అనధికారికంగా చేపడుతూ ఇసుక రవాణా ట్రాక్టర్లు అనధికారికంగా దొరికితే వేల రూపాయలు తీసుకొని వదిలివేయడం షరా మామూలు అయింది అని పలువురు చర్చించుకుంటున్నారు. తాను చెప్పినట్టు వినని ట్రాక్టర్లను టార్గెట్ గా పెట్టుకొని వెంటనే ఏడి, ఏజి తదితర మైనింగ్ శాఖ అధికారులు లేకుండానే తాను తనిఖీకి వెళ్లడం, లేదంటే ఎస్ఆర్వోలకు ఫోన్లు చేసి ఫలానా రూట్ లో వాళ్ళ అన్న ట్రాక్టర్ పట్టుకోవాలని ఆర్డర్లు వేస్తూ మైనింగ్ శాఖకు తానే అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించడంలో సంజీవ బాగా అనుభవం సంపాదించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లీజు వాహనాలకు రూట్ మ్యాప్ ఉండదు, నెలలో ఎక్కడ ఎన్ని రోజులు తిరిగిన రికార్డులు రాసేది లేదు
వాస్తవానికి లీజుకు తీసుకున్న ప్రతి వాహనానికి రికార్డ్ బుక్కు ఒకటి రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. వాహనం ఏ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు వెళ్లారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అని ప్రతిరోజు నోట్బుక్ రాయాల్సి ఉన్నప్పటికీ అలా రాసిన పాపాన పోలేదని, ఒకవేళ వాహనానికి డబ్బులు చెల్లించే సమయం వస్తే ఏదో తూతూ మంత్రంగా ఒకరోజు కూర్చుని అందరూ కలిసి నాలుగైదు నెలల రూట్ తిరిగింది మొత్తం ఒకేసారి హడావుడిగా నింపి బిల్లులో ఎత్తుతారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా వాస్తవంగా బుక్కులు రాసిన దానికి, ఫీల్డ్ మీద పోయిన దానికి మ్యాచ్ కానప్పటికీ అధికారులపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుని బిల్లులు ఎత్తడంలో సంజీవ దిట్ట అని పలువురు పేర్కొంటున్నారు.
ఎస్ ఆర్ ఓ ల వద్ద ఉండాల్సిన పాస్వర్డ్లు, ఓటీపీలు, సంజీవ వద్ద, ట్రాక్టర్ ఓనర్ల వద్ద ఉండటం ఆశ్చర్యకరం
ఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్న వాహనానికి సంబంధించి ఓటిపి కానీ, పాస్వర్డ్ గానీ ఇసుక బుక్ చేసుకున్న వారికి, ఇసుక బుక్ చేసిన ట్రాక్టర్ డ్రైవర్ కు, ఎస్ ఆర్ ఓ కు తెలిసి ఉంటుంది. ఇసుక బుక్ చేసుకున్న వాహనాలకు ఓటీపీలు నాలుగైదు ట్రాక్టర్లు ఉన్న ఓనర్ల వద్ద, డ్రైవర్ సంజీవ వద్ద ఎలా ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒకరోజు ఓటిపి వచ్చిన ట్రాక్టర్ కు సంబంధించిన బండి నెంబరు ఆరోజు ఒక ఓనర్ వద్ద తిరిగే అన్ని బండ్లకు అదే నెంబర్ను ఉపయోగించి దందా చేయడం ఒక రకమైన దోపిడి. ఇసుక బుక్ చేసుకున్న వాహనం ద్వారా అధికారికంగానే ఎలా అధికారుల కన్నుగప్పి డబ్బులను సొంతానికి ఉపయోగిస్తున్నారు అన్న విషయంపై వివరంగా వార్తను మరొక స్టోరీలో పొందుపరచునున్నాము.
సంజీవ బెదిరింపులకు వణుకుతున్న అధికారులు
మైనింగ్ శాఖలో ఒక తాత్కాలిక డ్రైవర్ కు మైనింగ్ శాఖ అధికారులు వణుకుతున్నారంటే నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయం. తాను చెప్పినట్టు నడుచుకోకుండా, తన మాటను వేద వాక్కు లాగా పాటించకుండా, తను సంతకం పెట్టమన్నచోట పెట్టకుండా ఉండే అధికారులు ఎవరినైనా సంజీవ బెదిరించే స్టయిల్ ఒక విధంగా ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. తన మాట వినని అధికారుల పాలిట యమకింకరుడుగా మారి బ్లాక్ మెయిల్ చేస్తూ తాను చెప్పినట్టు వినే విలేకరుల ద్వారా పత్రికలలో వార్తలు అధికారులకు వ్యతిరేకంగా రాయించడం సంజీవ కు వెన్నతో పెట్టిన విద్య. దీంతో అధికారులు కూడా తమకు ఎందుకు లే అని మౌనంగా ఊరుకుంటూ తమ ఉద్యోగం తాము చేసుకుంటూ మింగలేక, కక్కలేక, ఇతరులకు చెప్పుకోలేక నానా బాధలు పడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు పేర్కొనడం గమనార్హం. మైనింగ్ శాఖలో ఇతర సిబ్బంది కూడా సంజీవ కార్యాలయానికి వచ్చినాడు అంటేనే గప్చుప్ గా మౌనంగా ఉండి భయభయంగా ఉంటున్నామని పేర్కొనడం ఆశ్చర్యకరం. తీగ లాగితే డొంక కదులుతుంది' అన్నట్టుగా నిస్పాక్షికంగా విచారణ జరిపితే సంజీవ అసలు రంగు బహిర్గతం అవుతుందని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు విచారణ జరిపి ప్రభుత్వానికి గండి కొడుతున్న సంజీవ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
(గమనిక: ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విధానం ఎట్లా ఉంటుందనే విషయంలో పూర్తి ఆధారాలతో కూడిన ప్రత్యేక స్టోరీ రేపటి సంచికలో)
🏠 Home