🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:27 pm Posted by : A.Timma Gurudu

జోగులాంబ గద్వాల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి
జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం, దేవబండ, బింగిదొడ్డి గ్రామాల్లోని ఎండిపోయిన పంట పొలాలను వారు పరిశీలించి, రైతుల దయనీయ స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు మాసాలుగా పూర్తి వర్షాకాలంలోనూ వర్షపాతం అత్యంత లోటుగా నమోదైనట్లు ఐఎండీ స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగటున 17 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కెల్లా అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 41.3 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాధార పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయని, ముఖ్యంగా పత్తి పంట పరిస్థితి దారుణంగా మారి ఎకరాకు కనీసం 20 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతన్నలకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అందించడంతో పాటు, రైతు భీమా ప్రీమియంను వెంటనే చెల్లించాలని కోరారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ తక్షణమే ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను 100 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయాలని, కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి పంట చేతికి వచ్చే వరకు ఆర్డీఎస్ కు నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారిక్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ అధ్యక్షుడు తెలుగు నరసింహ, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, నాయకులు బింగిదొడ్డి లక్ష్మన్న, ప్రదీప్ శెట్టి, శ్రీకాంత్ ముదిరాజ్, తిమ్మారెడ్డి, రజక నరసింహులు, వీరన్న మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
🏠 Home