🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 4:05 pm Posted by : Telangana Vaartha

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం – అసాంఘిక చర్య.

News Image
“బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం” అనే హెచ్చరిక బోర్డు ప్రతి వైన్‌షాప్ వద్ద ఏర్పాటు చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
....ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట జిల్లా పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అది అసాంఘిక చర్యగా పరిగణించబడుతుందని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. రోడ్ల పక్కన, కల్వర్టుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలలు, ఆట స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. వైన్‌షాపుల వద్ద బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాల్సిన బాధ్యత వైన్‌షాప్ యజమానులపై ఉందని తెలిపారు. “బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం అని ప్రతి వైన్ షాప్ ముందు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పొలాల గట్లు, కల్వర్టు లు, వ్యవసాయ భూములు, రహదారుల పక్కన మద్యం సేవించి ఖాళీ మద్యం సీసాలను వ్యవసాయ భూమిలో పడేయడం వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసు శాఖ నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
🏠 Home