🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 1:13 am Posted by : Telangana Vaartha

ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు!

News Image
వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఒకేలా.. డూప్లికేట్‌గా గుర్తించిన యూఐడీఏఐ సిస్టమ్
ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 28:- డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడికి ఆధార్‌ కీలక గుర్తింపుగా మారింది. వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్ల ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపును అందించే ఆధార్‌ వ్యవస్థకే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన పదో తరగతి కవలలు అరుదైన సవాలుగా నిలిచారు. ఖిజ్రా జుబేర్‌, తూబా జుబేర్‌ అనే కవల విద్యార్థినుల వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్లు ఒకేలా సరిపోవడంతో ఆధార్‌ వ్యవస్థ వారిలో రెండో వ్యక్తిని డూప్లికేట్‌గా గుర్తించిన ఘటన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒకే రూపం కలిగిన కవలల్లోనూ వేలిముద్రలు, ఐరిస్‌ నమూనాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. అయితే ఈ ఇద్దరి విషయంలో బయోమెట్రిక్‌ వివరాలు సరిపోలడంతో పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్‌ కోసం బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేస్తున్న సమయంలో సమస్య తలెత్తింది. ఒకరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ పూర్తయిన వెంటనే రెండో విద్యార్థిని దరఖాస్తును యూఐడీఏఐ వ్యవస్థ డూప్లికేట్‌గా గుర్తించి తిరస్కరించింది. దీంతో విద్యార్థినుల విద్యా భవిష్యత్తుపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు రాంపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అజయ్‌ కుమార్‌ ద్వివేదిని ఆశ్రయించారు. ఈ అరుదైన కేసును ప్రత్యేకంగా పరిగణించిన డీఎం.. యూఐడీఏఐ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం, లఖ్‌నవూ ప్రాంతీయ కార్యాలయ అధికారులతో సమన్వయం చేశారు. అనంతరం యూఐడీఏఐ సాంకేతిక విభాగం కేసును పరిశీలించి ప్రత్యేక సాంకేతిక నిబంధనలు, మాన్యువల్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా పరిష్కార మార్గాన్ని చేపట్టింది. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ప్రక్రియ అనంతరం పాత రికార్డులను సరిదిద్ది ఇద్దరు విద్యార్థినులకు వేర్వేరు ఆధార్‌ గుర్తింపులను కేటాయించినట్లు సమాచారం. అత్యాధునిక బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థలు అత్యధిక సందర్భాల్లో సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటనలు సాంకేతిక వ్యవస్థల్లో ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను వెల్లడిస్తున్నాయి. అధికారుల సమన్వయంతో సమస్యకు పరిష్కారం లభించడంతో కవల విద్యార్థినుల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం సుగమమైంది.
🏠 Home