బీసీ అనే పదమే అడ్డమా..?
తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి, మంత్రి పదవిని సైతం త్యజించిన మహనీయుడు,
స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి గద్వాల జిల్లా కేంద్రంలో
అధికారికంగా నివాళులు నిర్వహించాలని బీసీ వర్గాలు, ప్రజలు కోరుతున్నారు.
జోగులాంబ గద్వాల 27 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని ఈదమ్మ గుడి సమీపంలో వ్యవసాయ మార్కెట్ (గంజి) వద్ద సుమారు మూడు సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ అనుమతులు, కౌన్సిల్ తీర్మానం వంటి ప్రక్రియలు పూర్తయ్యాయని, అప్పట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు జిల్లా స్థాయిలో అధికారికంగా జయంతి కార్యక్రమం నిర్వహించి విగ్రహం వద్ద నివాళులు అర్పించకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.? బీసీ కుటుంబంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, బీసీ వర్గానికే ఒక బలమైన నాయకుడు , తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు , హైదరాబాద్ సంస్థానంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఆయన ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా సేవలందించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తన పదవిని సైతం త్యజించిన త్యాగశీలిగా నిలిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించడం అంటే ఒక బీసీ నాయకుడిని గౌరవించడం మాత్రమే కాదు.. తెలంగాణ కోసం త్యాగం చేసిన మహనీయుడి సేవలను స్మరించుకోవడం. అందువల్ల జిల్లా అధికారులు ఈ విషయాన్ని సానుకూలంగా పరిగణించి, వచ్చే జయంతి నుంచి గద్వాల పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద అధికారికంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి వచ్చే ఏడాది నుంచి అధికారికంగా కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను గౌరవించడం.. తెలంగాణ చరిత్రను గౌరవించడమే