సూర్యాపేట జిల్లా సెప్టెంబర్ 26:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 7 మిడ్వే ప్లాజా రాయగూడెం సూర్యాపేట, లిటిల్ విలేజ్ బిర్యానీ సూర్యాపేట మరియు అన్నపూర్ణ మెస్ లను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం వంటి పలు లోపాలను గుర్తించారు. ఆహార తయారీ ప్రాంతం, హోటల్ వంటగది, రిఫ్రిజిరేటర్లు కూడా సక్రమంగా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్ర, అస్వచ్ఛ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా గుర్తించిన ఆహార పదార్థాల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపించారు. నమూనాల విశ్లేషణ నివేదిక అందిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై 7 మిడ్వే ప్లాజా రాయగూడెం సూర్యాపేట, లిటిల్ విలేజ్ బిర్యానీ మరియు అన్నపూర్ణ మెస్ లకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయడానికి జిల్లా డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కి సిఫార్సు చేశారు. ఆహార తయారీ ప్రదేశాలు, వంటగదులు, రిఫ్రిజిరేటర్లు, పరికరాలు, నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నిర్వహించాలని, ఆహార పదార్థాలను కీటకాలు, ఫంగస్, ఇతర కలుషితాలకు గురికాకుండా సురక్షితంగా నిల్వ చేయాలని అధికారులు సూచించారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని ఆహార వ్యాపార నిర్వాహకులకు స్పష్టం చేశారు. నమూనాల విశ్లేషణ నివేదికలు, ఇంప్రూవ్మెంట్ నోటీసుల అమలును బట్టి తదుపరి చర్యలు చేపడతామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి తెలిపారు.