🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 5:23 pm Posted by : GKSir

ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ‘లీగల్ ఎయిడ్ క్లినిక్

News Image
కలెక్టరేట్ ఆవరణలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం
బాధితులు సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి డా. శివరామ్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
శారీరక, మానసిక, వైకల్యాలున్న ప్రత్యేక ప్రతిభావంతులకు చట్టపరమైన రక్షణ, ఉచిత న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ (న్యాయ సహాయ కేంద్రం) ఏర్పాటైంది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, స్కీమ్-2024 నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి డాక్టర్ పి. శివరామ్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి భవ్య కోవిలతో కలిసి శనివారం ప్రారంభించారు.
హక్కుల రక్షణకు మార్గదర్శి: జిల్లా జడ్జి డాక్టర్ శివరామ్ ప్రసాద్
ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యాలున్న వారికి అండగా నిలిచేందుకు ఈ క్లినిక్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బాధితులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలు, సరైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు చట్టపరమైన హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్ భవనంలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేక న్యాయ సహాయ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలున్నా బాధితులు సంకోచించకుండా ఈ క్లినిక్‌ను సంప్రదించి పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కేంద్రం ద్వారా లభించే సేవలపై దివ్యాంగులు, సాధారణ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. హాసన్, లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్యానెల్ న్యాయవాది దావుల చిన్న వీరప్రసాద్,పారా లీగల్ వాలంటీర్ జయ, న్యాయ, సంక్షేమ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home