సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
- అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు పంపితే ఆర్థిక నష్టం తప్పదు.
– సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించేందుకు ఆకర్షణీయమైన పెట్టుబడి పథకాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ అరెస్ట్ వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులను కాజేస్తున్నారని తెలిపారు.
తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభాలు అంటూ ఆన్లైన్ పెట్టుబడి మోసాలు.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మిస్తారు. అనంతరం నకిలీ వెబ్సైట్లు లేదా యాప్‌లలో వర్చువల్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి, అందులో పెట్టుబడి పెట్టిన డబ్బు భారీగా పెరిగినట్లు చూపిస్తారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, జీఎస్టీ తదితర పేర్లతో మరింత డబ్బు చెల్లించాలని చెబుతారు. ఇలా బాధితుల నుంచి విడతల వారీగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరకు అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. తెలియని వ్యక్తులు, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ గ్రూపులు లేదా అనధికారిక యాప్‌ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దు.
ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ల పట్ల జాగ్రత్త.. ఇంటివద్ద నుంచే పని చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మిస్తారు. ఆన్లైన్ టాస్కులు, రివ్యూలు, రేటింగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మొదట కొంత మొత్తాన్ని చెల్లించి చిన్న మొత్తంలో రాబడి చూపిస్తారు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని, టాస్క్ పూర్తి చేయడానికి డబ్బులు చెల్లించాలని చెప్పి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తారు. ఉద్యోగం ఇప్పిస్తామని ముందుగానే డబ్బులు అడిగినా, ఆన్లైన్ వర్క్ కోసం పెట్టుబడి పెట్టాలని చెప్పినా అప్రమత్తంగా ఉండాలి.
“డిజిటల్ అరెస్ట్” పేరుతో బెదిరింపులు – పూర్తిగా మోసం.. మీ ఫోన్ నంబర్ డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ లేదా ఇతర నేరాలతో సంబంధం ఉందని, మీపై కేసులు ఉన్నాయని సైబర్ నేరగాళ్లు భయపెడుతున్నారు. పోలీసులు, సీబీఐ, ఏసీబీ, కస్టమ్స్, కోర్టులు లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారుల పేర్లు, ఫోటోలు, నకిలీ గుర్తింపు కార్డులు ఉపయోగిస్తూ వీడియో కాల్లో విచారణ చేస్తున్నట్లు నటిస్తారు. “డిజిటల్ అరెస్ట్ చేశాం, కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు పంపాలి” అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే నమ్మవద్దు. అధికారుల పేర్లు చెప్పినా, వీడియో కాల్లో పోలీస్ యూనిఫాం ధరించి కనిపించినా భయపడవద్దు. డబ్బులు పంపవద్దు.
ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు..
👉🏻 తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు.
👉🏻 తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు.
👉🏻 OTP, PIN, CVV, ATM వివరాలు, UPI PIN ఎవరికీ చెప్పవద్దు.
👉🏻 సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మి డబ్బులు పంపవద్దు.
👉🏻 అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాల విషయంలో పూర్తి వివరాలు పరిశీలించాలి.
👉🏻 ఉద్యోగం లేదా ఆన్లైన్ వర్క్ పేరుతో ముందుగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి.
👉🏻 తెలియని వ్యక్తుల సూచనల మేరకు AnyDesk, TeamViewer వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను ఇన్స్టాల్ చేయవద్దు.
👉🏻 బ్యాంకు అధికారులు, పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల పేరుతో ఫోన్ చేసినా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు చెప్పవద్దు.
👉🏻 భయపెట్టి లేదా అత్యవసరంగా డబ్బులు పంపాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మవద్దు.
👉🏻 మీ బ్యాంక్ ఖాతా, UPI లేదా సిమ్‌ను ఇతరులకు ఉపయోగించేందుకు ఇవ్వవద్దు.
మోసానికి గురైతే వెంటనే పిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన డబ్బును నిలిపివేయడానికి/రికవర్ చేయడానికి సంబంధిత సంస్థలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ. అత్యాశ, భయం – సైబర్ నేరగాళ్లకు ఆయుధాలు.
తెలియని వ్యక్తులను నమ్మి డబ్బులు పంపవద్దు.