వయోవృద్ధుల గౌరవం సమాజం బాధ్యత
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సమాచార సంచిక ఆవిష్కరణ
వయోవృద్ధుల హక్కులు, రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 సందర్భంగా నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో వయోవృద్ధుల హక్కులు, రక్షణ, సంక్షేమానికి సంబంధించిన సమాచార సంచికను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వయోవృద్ధులను గౌరవించడం, వారి భద్రతకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చట్టపరమైన హక్కులు, వారికి అందుబాటులో ఉన్న సేవలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హక్కులపై అవగాహన ఉన్నప్పుడే వయోవృద్ధులు ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. వయోవృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం లేదా వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను సహించబోమని, వారిపై నిర్లక్ష్యానికి పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. వయోవృద్ధుల రక్షణ, సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వయోవృద్ధుల హక్కులు, రక్షణ, సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన సమాచార సంచికలను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన సమయంలో వయోవృద్ధులు పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి డి. సునంద, గద్వాల సీఐ శ్రీ టంగుటూరి శ్రీను, జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO) శ్రీ బి. నర్సింహులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.