🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 12:38 am Posted by : Telangana Vaartha

ఎల్‌నినో ప్రభావం వలన నీటిని పొదుపుగా వాడుకోవాలి

News Image
కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌తో మంతనాలు—సానుకూల స్పందన
సాగు చేసిన పంటలను కాపాడతాం.. వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం
రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన దుయ్యబట్టారు. రైతుల కష్టాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవడం బాధ్యతాయుత మైన ప్రతిపక్ష లక్షణం కాదని మండిపడ్డారు.బుధవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అదే కార్యక్రమంలో రూ.20 లక్షలతో నిర్మించిన జానల్‌దిన్నె గ్రామపంచాయతీ భవనం, రూ.33 లక్షలతో నిర్మించిన నేరేడుచర్ల గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. మొత్తం రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ “ఎల్‌నినో అనేది తెలంగాణలో పుట్టిన పదం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే శాస్త్రీయ పరిణామం. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కినప్పుడు ప్రపంచ వాతావరణ నమూనాలు మారుతాయి. భారత రుతుపవనాలపైనా దాని ప్రభావం పడుతుంది. ఈసారి కొన్ని కీలక దశల్లో వర్షపాతం దాదాపు 40 శాతం వరకు తగ్గింది. “ఆకాశంలో ఎల్‌నినో వర్షాలను అడ్డుకుంటే రైతు పొలంలో పంట ఎండిపోతే ప్రభుత్వానికి బాధ కలుగుతుందని, వర్షాలను ఎవరూ స్విచ్‌ వేసి కురిపించలేరని, అయితే అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ కాపాడి ప్రజల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ సాగు చేసిన పంటలను కాపాడడం, రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడడం కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తోందన్నారు. “సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని వెతికేది ప్రభుత్వమని మేము రైతుల పంటలను కాపాడేందుకు నీళ్ల కోసం రాష్ట్రాల తలుపులు తడుతున్నాం. జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ తో మంతనాలు జరిపినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం వినియోగించానని చెప్పారు. తెలంగాణ విజ్ఞప్తికి డి.కె. శివకుమార్ సానుకూలంగా స్పందించారని, నీటి లభ్యతను పరిశీలించి సహకరించేందుకు హామీ ఇచ్చారని వివరించారు. “మేం కర్ణాటకతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం, మాకు రాజకీయాల కంటే ప్రజలు, పంటలు ముఖ్యం; ప్రచారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం” అని స్పష్టం చేశారు. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుందని చెప్పారు. అవసరమైన చోట నీటి విడుదల, ప్రత్యామ్నాయ వనరుల వినియోగం, జలాశయాల సమర్థ నిర్వహణపై నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.

“సాగు చేసిన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథలుగా వదిలిపెట్టం. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వేసవిలో ప్రజల గొంతు ఎండకుండా మంచినీటి సరఫరాకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రకృతిని శాసించలేకపోవచ్చు.. కానీ ప్రజలను కాపాడే బాధ్యత నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లం” అని ప్రకటించారు. హైదరాబాద్‌లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సన్నాహక సమావేశం ఉన్నప్పటికీ నేరేడుచర్ల–దూపాడు రహదారి ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా హాజరయ్యానని మంత్రి తెలిపారు. ఈ రహదారిని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
నూతన డబుల్ రోడ్డు నిర్మాణంతో నేరేడుచర్లతోపాటు పత్తేపురం, వైకుంఠపురం, రామలక్ష్మీపురం, మేడారం, బక్కయ్యగూడెం, దూపాడు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. “ఈ ప్రాంతంతో నాకు ఉన్నది కేవలం రాజకీయ సంబంధం కాదు—ప్రజలతో పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధం. మీ శ్రమ, చెమట, ప్రేమ, ఆదరాభిమానాల తోనే నేను ఆరు సార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యాను. మీ రుణాన్ని అభివృద్ధితోనే తీర్చుకుంటాను” అని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతం కావడం ఈ ప్రాంత యువతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. “రోడ్లు, భవనాలు నిర్మించడం అభివృద్ధిలో ఒక భాగం. కానీ ఒక యువకుడికి ఉద్యోగం వచ్చి, అతని కుటుంబంలో వెలుగు నిండితే అంతకంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. కోదాడ మెగా జాబ్ మేళా విజయం ప్రజల ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో నిరూపించింది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రైతుల రక్షణ, యువతకు ఉపాధి, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహ, హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, మేడారం సర్పంచ్ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
🏠 Home