🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 7:58 pm Posted by : Telangana Vaartha

భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలి

News Image
జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్2026 తెలంగాణవార్త ప్రతినిధి. పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంతో పాటు మరో విద్యార్థి హెచ్‌సీఎల్ టెక్‌బీకి ఎంపికైన సందర్భంగా మాజీ సైనికుడు ఇటిక్యాల మైరాముడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. పులికల్ ప్రభాకర్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులు సత్యాన్వేష్ (తండ్రి ప్రభాకర్), కళ్యాణ్ రాజ్ (తండ్రి రాజు), గీతిక (తండ్రి రమేష్), అలాగే హెచ్‌సీఎల్ టెక్‌బీకి ఎంపికైన విద్యార్థి వి.సువాబన్ (తండ్రి వి. రాజు)లను మరియు వారి తల్లిదండ్రులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైరాముడు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దళితులు ఉన్నత విద్యను అభ్యసించాలని, విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎంబీబీఎస్ సీట్లు సాధించడం విద్యార్థుల కష్టపడి చదివిన తీరుకు నిదర్శనమని, ఇది గర్వించదగ్గ విషయమన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో వైద్యులుగా స్థిరపడిన అనంతరం సమాజంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా హెచ్‌సీఎల్ టెక్‌బీకి ఎంపికైన విద్యార్థి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో సొంతంగా కంపెనీలు స్థాపించే స్థాయికి చేరుకోవాలని మైరాముడు ఆకాంక్షించారు. కష్టపడి చదివి సీట్లు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నత విలువలతో ముందుకు సాగేలా ప్రోత్సహించిన ప్రజాసంఘాల నాయకులకు, ముఖ్యంగా మాజీ సైనికుడు మైరాముడుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విజయాన్ని గుర్తించి సన్మానించడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు ప్రభుదాసు, అలెగ్జాండర్, ప్రసంగి, ఇమ్మానేలు, బుచ్చన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home