పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి కసరత్తు ప్రారంభం
డీనోవో పద్ధతిలో ఓటర్ల జాబితా. సెప్టెంబర్ 28 నుండి దరఖాస్తు స్వీకరణ
నమోదు గడువు నవంబర్ 6. డిసెంబర్ 30న తుది జాబితా
జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మహబూబ్‌నగర్–రంగారెడ్డి –హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2027 మార్చిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సెప్టెంబర్ 28న ప్రజా ప్రకటన జారీ చేయడంతో పాటు, అక్టోబర్ 15న, అక్టోబర్ 25న వార్తాపత్రికల్లో ప్రజా ప్రకటనను పునఃప్రచురించనుట్లు తెలిపారు. నవంబర్ 6,2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం నవంబర్ 25, 2026న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన అనంతరం డిసెంబర్ 30, 2026న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈసారి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందిస్తున్నందున,గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా కొత్తగా ఫారం–18 దరఖాస్తు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఫారం –18లో ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదని,అది పూర్తిగా స్వచ్ఛందమని కలెక్టర్ స్పష్టం చేశారు.ఆధార్ నంబర్ ఇవ్వలేదనే కారణంతో దరఖాస్తును తిరస్కరించరాదని తెలిపారు. ఆధార్ వివరాల గోప్యతను కాపాడుతూ, నిబంధనల ప్రకారం వివరాలను భద్రపరచాలని అధికారులను ఆదేశించారు.ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన తేదీలు, విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.