మొక్కజొన్న డీసీఎంలను పట్టుకుని వదిలారా?
జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-మండలం కొండపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ గిడ్డంగుల గోదాము నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు డీసీఎంల మొక్కజొన్న లోడును లారీ అసోసియేషన్ డ్రైవర్లు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాత్రివేళ బ్లాక్ మార్కెట్కు తరలింపు?
కొన్ని రోజులుగా గోదాం మేనేజర్, సిబ్బంది కుమ్మక్కై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మొక్కజొన్నను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారని స్థానిక డ్రైవర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో నకిలీ ఇన్వాయిస్లు సృష్టిస్తూ డీసీఎంలలో అక్రమ రవాణా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా డీసీఎం వాహనాల్లో ధాన్యం తరలించడంపై లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికారుల దాటవేత ధోరణి:
ఘటన జరిగిన వెంటనే గద్వాల రూరల్ పోలీసులతో పాటు విలేకరులు అక్కడికి చేరుకుని విచారించగా, మార్కెఫెడ్ అధికారులు మాత్రం అనుమతుల ప్రకారమే వాహనాల్లో తరలిస్తున్నామని చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీనిపై మార్కెఫెడ్ అధికారి చంద్రమౌళిని వివరణ కోరగా, సమగ్ర విచారణ చేపట్టిన అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే గోదాం ఇన్చార్జి మేనేజర్ నసీర్ పాత్రపైనే ప్రదానంగా అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఉన్నతాధికారి ఒకరు స్థలానికి వచ్చి తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లు తప్పించుకోవడం గమనార్హం.
సెటిల్మెంట్ పుకార్లు – కేసు నమోదు కాకుండా మేనేజ్?
డీసీఎంలను పట్టుకున్నప్పటికీ కేసు నమోదు కాకుండా పలుకుబడి ఉన్న వ్యక్తులు రంగంలోకి దిగి వ్యవహారాన్ని సర్దుబాటు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందరికీ 'వాటాలు' చెల్లించి సెటిల్మెంట్ పూర్తి చేశారని, అందుకే ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారనే చర్చ పుకార్ల బజార్లో సాగుతోంది. కాగా, గతంలోనూ ఇదే గోదాము వద్ద నుంచి రెండు లారీల యూరియా చోరీకి గురికావడం, దానిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉండటం గమనార్హం.